ఆ హామీ ఇచ్చినందుకే నాపై కుట్ర పన్నారు.. తిరుమలలో పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

-

సినీ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ తిరుమలలో ప్రత్యక్షమైయ్యారు. కుటుంబ సభ్యులతో అయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఎస్వీబీసీలోని ఓ మహిళా ఉద్యోగితో సరస సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్ వెలుగులోకి రావడంతో.. చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో నెల రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసిన పృథ్వీరాజ్ చాలా రోజుల తర్వాత మీడియాకు కనిపించారు. తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఎప్పుడు మంచి హుషారుగా కనిపించే పృథ్వీరాజ్ ఈసారి బాగా ముభావంగా కనిపించారు. అయితే శ్రీవారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడుతూ పృథ్వీరాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కుట్రపూరితంగా తనను ఎస్వీబీసీ నుంచి తప్పించారని, తనను బయటకు పంపి కొందరు పైశాచికానందం పొందారని చెప్పారు. దీంతో తాను కొన్ని రోజులుగా తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను అమలు చేస్తామని హామీ ఇచ్చినందుకే తనపై కుట్ర పన్నారని పృథ్వీరాజ్‌ ఆరోపించారు. సజ్జల, వైవీ, విజయసాయిరెడ్డిలకు మాత్రమే తాను జవాబుదారిగా ఉంటానని చెప్పారు. నిరసనలు తెలుపుతున్న అమరావతి రైతులపై తాను చేసిన ‘పెయిడ్‌ ఆర్టిస్టులు’ వ్యాఖ్యలపై స్పందించారు. రాజధాని రైతులను కించపరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని చెప్పుకొచ్చారు. తాను ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news