పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి గురువారం ఉదయం 9.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి43 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ లో ఒక స్వదేశీ ఉపగ్రహంతోపాటు అమెరికా, కెనడా, కొలంబియా, మలేషియా తదితర దేశాలకు చెందిన 30 ఉపగ్రహాలున్నాయి. బుధవారం ఉదయం 5.59 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 28 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగిన అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ రాకెట్ నిర్దేశించిన సమయానికి విజయవంతంగా మూడు దశలను దాటుకుంటూ కక్ష్యలోకి ప్రయాణించింది.
దీని ద్వారా మన దేశానికి చెందిన హైపవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు కక్ష్యలో ప్రవేశపెట్టారు. విదేశీ ఉపగ్రహాల మొత్తం బరువు 261.5 కిలోల బరువు కాగా, వీటిలో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిని పీఎస్ఎల్వీసీ 43 రాకెట్ ద్వారా వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టనున్నారు. పీఎస్ఎల్వీ ద్వారా నాలుగు దశల్లో ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ తెలిపారు.