కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన మరో 118 యాప్స్ ను రెండు రోజుల క్రితం నిషేధించిన విషయం విదితమే. కాగా ఆ యాప్స్ లో ప్రముఖ మొబైల్ గేమ్ పబ్‌జి కూడా ఉంది. అయితే ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో పబ్‌జి మొబైల్ గేమ్‌ను తొలగించారు. దీంతో ఆ గేమ్ ఇప్పుడు రెండు స్టోర్స్‌లోనూ కనిపించడం లేదు.
గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో పబ్‌జి గేమ్ కోసం సెర్చ్ చేస్తే ఆ గేమ్ రావడం లేదు. అయితే యూజర్లు కొత్తగా ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఇప్పటి నుంచి కుదరదు. కానీ ఇప్పటికే గేమ్‌ను ఆడుతున్నవారికి కూడా ఈ సేవలు మరో రెండు రోజుల్లో నిలిచిపోతాయని తెలిసింది. అందుకు గాను గేమ్‌ను ఆడేవారికి యాప్ నుంచి నోటిఫికేషన్ వస్తుందని సమాచారం. తరువాత గేమ్ పనిచేయకుండా పోతుంది.
అయితే పబ్‌జి మొబైల్‌కు సంధించిన మొబైల్ వెర్షన్ ను మాత్రమే ప్రస్తుతం బ్యాన్ చేశారు. పబ్‌జి పీసీ వెర్షన్ అందుబాటులోనే ఉంది. మరి దీన్ని కూడా బ్యాన్ చేస్తారో, లేదో చూడాలి. అయితే పబ్‌జి పీసీ వెర్షన్‌కు చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్‌కు సంబంధం లేదు. కేవలం మొబైల్ కు సంబంధించి మాత్రమే టెన్సెంట్ కంపెనీ బ్లూహూల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కనుక పబ్‌జి పీసీ గేమ్ నిషేధానికి గురయ్యే అవకాశం లేదని అంటున్నారు.