చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత ప్రభుత్వం పబ్‌జి గేమ్ సహా మొత్తం 118 యాప్‌లను నిషేధించిన విషయం విదితమే. అయితే ఈ గేమ్ డెవలపర్ బ్లూ హోల్ తమకు టెన్సెంట్ గేమ్స్ తో ఉన్న సంబంధాన్ని వదులుకుంది. భారత్‌లో పబ్‌జి గేమ్ పై నిషేధం ఎత్తివేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కానీ ఆ గేమ్‌పై నిషేధం ఎత్తివేత ఇప్పట్లో కనిపించేలా లేదు. అందుకు చాలా సమయం పట్టవచ్చని తెలుస్తోంది.
పబ్‌జి గేమ్‌ను బ్యాన్ చేసినప్పటికీ ఆ గేమ్‌ను యాప్ స్టోర్, ప్లే స్టోర్‌ల నుంచి తొలగించారు. అంతే.. కానీ ఆ గేమ్‌ను ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఐఎస్‌పీల పరంగా గేమ్‌ను ఇంకా బ్యాన్ చేయలేదు. అయితే ఐఎస్‌పీలు గేమ్‌ను బ్యాన్ చేస్తాయా, లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సమయంలో పబ్‌జి డెవలపర్లు దేశీయ టెలికాం దిగ్గజ సంస్థ జియోతో సంప్రదింపులు జరుపుతున్నారు. జియోతో కలిసి గేమ్‌ను మళ్లీ పబ్లిష్ చేసేందుకు వారు ఆలోచిస్తున్నారు. అందుకనే గేమ్ ను మళ్లీ అందుబాటులోకి తెస్తామని దాని డెవలపర్లు ధీమాగా చెబుతున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
కాగా పబ్‌జి గేమ్‌ను బ్యాన్ చేసినప్పటి నుంచి బ్లూ హోల్ కంపెనీ పెద్ద ఎత్తున నష్టపోయింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం నిషేధిత యాప్స్‌ను ఇకపై ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించేది లేదని స్పష్టమైన నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి పబ్‌జి డెవలపర్లు భారత్ లో దుకాణం సర్దుకుంటారా, లేదా గేమ్‌ను ఏదైనా భారతీయ కంపెనీతో కలిసి మళ్లీ అందుబాటులోకి తెస్తారా, అసలేమవుతుంది ? అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.