ఢిల్లీపై పంజాబ్ ఘ‌న విజ‌యం

-

దుబాయ్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 38వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఢిల్లీ విసిరిన 165 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ సునాయాసంగానే ఛేదించింది. ఓ ద‌శ‌లో వెనుక‌బ‌డిన‌ట్లు క‌నిపించినా త‌రువాత పుంజుకుని పంజాబ్ ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను స‌జీవం చేసుకుంది.

మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత‌ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 164 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ల‌లో శిఖ‌ర్ ధావ‌న్ అద్భుతంగా రాణించాడు. కేవ‌లం 61 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో స్కోరు బోర్డును ప‌రుగెత్తించాడు. 106 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిగిలిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ ఆక‌ట్టుకోలేదు. పంజాబ్ బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ 2 వికెట్లు తీయ‌గా, మాక్స్‌వెల్‌, నీష‌మ్‌, అశ్విన్‌లు త‌లా 1 వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ 19 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్ల‌ను కోల్పోయి 167 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో నికోలాస్ పూర‌న్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు రాణించారు. 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో పూర‌న్ 53 ప‌రుగులు చేయ‌గా, 24 బంతుల్లో 3 ఫోర్ల‌తో మ్యాక్స్‌వెల్ 32 ప‌రుగులు చేశాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ర‌బాడా 2 వికెట్లు తీశాడు. అక్ష‌ర్ ప‌టేల్‌, ఆర్‌. అశ్విన్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version