పూరీ మ్యూజింగ్స్: మనుషులు దయ్యాలకే పుట్టుంటారు.. దేవుడున్నాడా అనే దానిపై పూరీ జగన్నాథ్ సమాధానం

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, పూరీ మ్యూజింగ్స్ పేరుతో ఒక్కో విషయం మీద తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. తాజాగా దేవుడున్నాడా అనే టాపిక్ మీద ఆయన మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి.

దేవుడిని మనిషే తయారు చేసాడా? లేదా మనిషిని దేవుడు తయారు చేసాడా అన్న అంశాల మీద పూరీ జగన్నాథ్ సమాధానం.

మొదటగా, మనుషులను దేవుడే తయారు చేసాడనుకుందాం.

స్టీవ్ జాబ్స్ తయారు చేసిన ఐఫోన్ అద్భుతం. ఎలాన్ మస్క్ రూపొందించిన టెస్లా కార్ అమోఘం. మరి వీళ్ళు తయారు చేసినవే అంత సూపర్ గా ఉన్నప్పుడు దేవుడు తయారు చేసిన మనుషులు ఇంకెలా ఉండాలి. ఒక్కొక్కడు అద్భుతంగా ఉండాలి. కానీ అలా లేరే? ఎవ్వడ్ని పట్టుకున్నా డౌట్లు, భయాలు, కన్ఫ్యుజన్లు.. మనశ్శాంతి లేదు. ప్రాబ్లమ్స్ వస్తే గాల్లోకి చూస్తుంటాం. వెక్కివెక్కి ఏడుస్తుంటాం. ఎన్నో లోపాలు. మనం నిజంగా దేవుడి పిల్లలమే అయితే దేవుడి లక్షణాలు మనకు ఒక్కటైనా ఉండాలిగా! దేవుడిలా అందరినీ ప్రేమించలేం. కరుణా లేదు, కనికరం లేదు. సాయం చేసే గుణం లేదు. ఇన్ని వరస్ట్ క్వాలిటీస్ తో దేవుడు తన పిల్లలను తయారు చేసుకోడు కాబట్టి, మనం ఏ దయ్యానికో పుట్టుంటాం.

ఇక రెండవది, దేవుడిని మనిషే తయారు చేసాడనుకుందాం.

మనిషే దేవుడిని తయారు చేస్తే దేవుడు ఎలా పుట్టాడు. ఐన్ స్టీన్ తయారు చేసాడా? న్యూటన్ డిజైన్ చేసాడా? కాదు.. మనలాంటి సాధారణ మనిషి దేవుడిని తయారు చేసాడు. సగటు మానవులే దేవున్ని తయారు చేసారు. వాళ్ల భయం నుండి, ఆకలి నుండి, తీరని కోరికల నుండి దేవున్ని తయారు చేసారు. నమ్మశక్యం కాని కథలు పుట్టించారు. స్వర్గం అని ఊహాలోకం సృష్టించారు. అదే గమ్యం అని చెప్పి టికెట్స్ అమ్ముతున్నారు. ఎవరి టికెట్ తీసుకోవాలనేది ఎవ్వరికీ తెలియదు.

ఎవరైనా దేవుడున్నాడా లేదా అని అడిగితే నో అని చెప్పండి. ఎందుకంటే వాళ్ళనుకుంటున్న దేవుడు మాత్రం ఈ ప్రపంచంలో లేడు. ఒకవేళ ఆ పైన ఇంకెవరో ఉంటే వాళ్ళ పేరు మాత్రం దేవుడు కాదు.