ఆక్రమిత ఉక్రెయిన్​లో పుతిన్.. రష్యా సైనికాధికారులతో సంభాషణ

-

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను సందర్శించారు. దక్షిణ ఖేర్సన్‌లో జరిగిన సైనిక సమావేశంలో పుతిన్‌ పాల్గొన్నట్లు క్రెమ్లిన్‌ మంగళవారం ప్రకటించింది. స్థానిక కమాండర్‌తోపాటు జపోరిజియా, ఎయిర్‌బోర్న్‌ ఫోర్స్‌, నీపర్‌ ఆర్మీ సభ్యులతో సంభాషించి తాజా పరిస్థితి తెలుసుకొన్నారు పుతిన్. లుహాన్స్క్‌ ప్రాంతంలో నేషనల్‌ గార్డ్స్‌ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు.

పుతిన్‌ పర్యటనకు సంబంధించిన వీడియోను క్రెమ్లిన్‌ విడుదల చేసింది. కాకపోతే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించిందో వెల్లడించలేదు. చైనా రక్షణ మంత్రితో భేటీ కోసం పుతిన్‌ ఆదివారం మాస్కోలోనే ఉన్నారు. పుతిన్‌ లుహాన్స్క్‌ వెళ్లేందుకు హెలికాప్టర్‌ ఎక్కుతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. రష్యా ఆక్రమించుకొన్న నాలుగు ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో ఖేర్సన్‌, జపొరిజియా కూడా ఉన్నాయి. వీటిల్లో కొంతభాగంపై రష్యా పట్టు ఉంది. పుతిన్‌ పర్యటన రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదనే సంకేతాలు ఇచ్చింది.

మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ రష్యా ఆక్రమణలోని దొనెట్స్క్‌ ప్రాంతానికి సమీపంలో పట్టణం అవదివ్కాలో మంగళవారం పర్యటించారు. అక్కడి బలగాలకు ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి ఫొటోలు దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news