ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీలను నిరుద్యోగ, ఉద్యోగ సంఘాలతో చర్చించి మెగా డీఎస్సీ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. టీచర్ పోస్టుల భర్తీలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంను స్వాగతిస్తున్నానని తెలిపారు.
ఆదివారం విద్యానగర్లోని బీసీ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ టీచర్ పోస్టుల సంఖ్య విషయంలో కేవలం ఉద్యోగులపై ఆధారపడకుండా ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. పీఆర్సీ నివేదిక ప్రకారం ఎయిడెడ్ పాఠశాలల్లో 49 వేల ఖాళీలను,పదవీ విరమణ వల్ల ఏర్పడిన 24 వేల ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
గవర్నమెంట్ స్కూల్స్ లో ఖాళీగా ఉన్న 10,000 పోస్టులు, ఐదు వేల ఆర్ట్, క్రాప్ట్, డ్రాయింగ్ పోస్టులను ఒకే సారి భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.ఉన్నత పాఠశాలల్లో అధ్యాపకుల నియామకాలు,కంప్యూటర్ల ఏర్పాటు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అటెండర్లు, స్వీపర్ పోస్టులు,ఆయాలు భర్తీ చేసి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేత గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ, అనంతయ్య, దుర్గా,ప్రియా, నీల వెంకటేశ్, అంజి, రాణి తదితరులు పాల్గొన్నారు.