ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అనుచరుడిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

సూర్యాపేట : ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ అనుచరుడు, బహుజన విద్యారి నాయకుడు పాల్వాయి నగేష్ పై దాడి చోటు చేసుకుంది. సూర్య పేట జిల్లా నాగారం మండలం పస్తాల వద్ద పాల్వాయి నగేష్ ను అదే జిల్లాకు చెందిన టీఆరెస్ పార్టీ కార్యకర్తలు చితకబాదారు. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ పై ఓ ఛానల్ లైవ్ షో లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే… ఈ వ్యవహరం నేపథ్యంలో ఎమ్మెల్యే కిషోర్ పై ఓ సెల్ఫీ వీడియో పెట్టాడు నగేష్.

ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై మళ్లీ తప్పుగా మాట్లాడితే ఊరుకోమంటూ సెల్ఫీ వీడియో పెట్టాడు నగేష్‌.. అంతేకాదు ఎమ్మెల్యే కిషోర్‌ రాజీనామా చేయాలంటూ నేడు తుంగతుర్తి లో అంబెడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాడు పాల్వాయి నగేష్. ఈ నేపథ్యంలోనే నాగరం మండలం పస్తాల వద్దకు రాగానే నగేష్ పై దాడి చేశారు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిపోగా…నగేష్‌ గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది.అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.