ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలోనే కాదు, భారతదేశంలోనే దివంగత నేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర ఒక వినూత్న ఒరవడిని, ప్రజలపట్ల ప్రభుత్వానికి, పాలకులకు ఉండదగిన కర్తవ్యం పట్ల సరికొత్త సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో బాగా వెనుకబడిన ప్రాంతాలను సందర్శించి అద్భుతమైన పాలనను అందించారు.. ఇలా మొదలు పెట్టారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు!
వైఎస్సార్సీపీ కి కంటిలోని నలుసు, కాలి ముళ్లు, చెప్పులోని రాయి, చెవులోని జోరిగ అన్నట్లు … రెబల్ ఎంపీగా పేరు సంపాదించుకున్న రఘురామకృష్ణంరాజు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. “మనసున్న మహారాజు డా. వై.ఎస్.ఆర్” అంటూ రెండు పేజీల లేఖలో దివంగత నేతపై తనకున్న ప్రేమాభిమానలను, గౌరవాన్ని, ఆయన పరిపాలనలో వచ్చిన పెను మార్పులను ప్రస్థావించారు ఆర్.ఆర్.ఆర్.!
ఆయన చేపట్టిన పథకాలు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని.. జలయజ్ఞంతో వృథా జలాల వినియోగానికి శ్రీకారం చుట్టారని.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేశారని.. ప్రజలు, ప్రజాప్రతినిధులతో నిత్యం మమేకమై, అందరికీ నేనున్నాననే భరోసా కల్పించారని రఘురామ కృష్ణరాజు.. వైఎస్సార్ ను ఆ లేఖలో కొనియాడారు!
కాగా… తాజాగా వైకాపా నేతలు నేరుగా మైకులముందుకు వచ్చి రఘురామకృష్ణంరాజును “వెన్నుపోటుదారులు” అంటూ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఆయనను ఎంపీ కుర్చీ నుంచి దింపించేయాలని వైకాపా ఢిలీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే!