అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా తప్పుకుంటుందని తెలిపారు. ఈ మేరకు ఆయన అమెరికా కాంగ్రెస్‌తోపాటు ఐక్యరాజ్యసమితికి ఒక ప్రకటన పంపించారు. 2021 జూలై 6వ తేదీ నుంచి అమెరికా WHO నుంచి శాశ్వతంగా తప్పుకుంటుందని అన్నారు.
కరోనా మహమ్మారి విషయంలో మొదట్నుంచీ మెతక వైఖరి ప్రదర్శిస్తుండడం, ఆ మహమ్మారి పుట్టుకకు కారణమైన చైనాతో WHO కుమ్మక్కైందంటూ.. మొదట్నుంచీ ట్రంప్ ఆరోపిస్తూనే వస్తున్నారు. అందులో భాగంగానే ఆయన తాజాగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని తెలిపారు. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థలో అమెరికా 70 ఏళ్లుగా సభ్య దేశంగా ఉంది. ఆ సంస్థలో అమెరికాదే కీలకపాత్ర. నిధుల విషయంలోనూ ఇతర సభ్యదేశాల కన్నా అమెరికాయే WHOకు ఎక్కువ నిధులను అందజేస్తూ వస్తోంది.
కాగా 1948లో చేసుకున్న సంయుక్త తీర్మానం ప్రకారం.. అమెరికా WHOకు 200 మిలియన్ డాలర్లకు పైగా బాకీ ఉంది. దీంతో వచ్చే ఏడాది వరకు ఆ బాకీని అమెరికా పూర్తిగా తీర్చేయనుంది.
ఏప్రిల్ నెలలో ట్రంప్ WHOకు నిధులివ్వడం ఆపేశారు. చైనా మహమ్మారికి సంబంధించిన వాస్తవాలను WHO కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తుందని, ఆ విషయంలో మొత్తం వ్యవహారంపై సమీక్ష జరపాలని ఆయన అన్నారు. WHO చైనాకు సపోర్ట్ చేస్తుందని, ఆ ఇద్దరి చర్యల వల్ల ప్రపంచంలో సగం జనాభా లాక్‌డౌన్‌లో గడపాల్సిన దుస్థితి ఏర్పడిందని, 184కు పైగా దేశాలు కరోనా అనే నరకంలో చిక్కుకున్నాయని.. ట్రంప్ మండిపడ్డారు. ఇక మే నెలలో WHO నుంచి అమెరికా వైదొలగుతుందని ట్రంప్ ప్రకటన చేశారు. చెప్పినట్లే ఆయన తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
అయితే ట్రంప్ నిర్ణయాన్ని యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసీ, యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌లు వ్యతిరేకించారు. ప్రస్తుతం WHO మాత్రమే ప్రపంచ దేశాలన్నింటితో సమన్వయం చేసుకుంటూ కోవిడ్ పై పోరాటం చేస్తుందని, ఇలాంటి కీలక సమయంలో WHO నుంచి అమెరికా తప్పుకోవడం అర్థం లేని చర్య అని అన్నారు.