అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీ- కాంగ్రెస్ సిద్దం అవుతోంది. వచ్చే నెల (ఏప్రిల్) మొదటి వారంలో హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీ- కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఈ తుక్కుగూడ సభలోనే పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానుండటంతో పాటు.. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐసీసీ హైదరాబాద్లోని రిలీజ్ చేస్తుండటంతో టీ-కాంగ్రెస్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. పకడ్బందీగా ఏర్పాట్లు చేసి సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని టీ-కాంగ్రెస్ సిద్ధం అవుతోంది.