కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ వ్యవహరించబోతున్నారని అన్నారు. మోడీ సర్కార్ను రాహుల్ గాంధీ కంటే బలంగా ఎవరు ప్రశ్నించలేరు అని అభిప్రాయపడ్డారు. మోడీ సర్కార్ను దేశ వ్యాప్తంగా ప్రజలు తిరస్కరించారని విమర్శలు చేశారు.
400 సీట్లు అని గొప్పలకు పోయి కూటమికి కూడా 293 సీట్లే వచ్చాయని ఎద్దేవా చేశారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్కు ఆదరణ పెరిగిందని వెల్లడించారు. బీజేపీ రాజకీయ ఎత్తుగడలను ప్రజలు కూడా పసిగట్టారని అన్నారు. మతం, కులం పేరుతో ఓట్లు రాబట్టుకోవడం అన్నిసార్లు సాధ్యం కాదని తెలిపారు. కాగా, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్నీ సీట్లు సాధించినా.. ఏ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు ఎన్డీఏ సిద్ధమవుతోంది.