బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు లపై మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్ అయ్యారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం వేదిక గా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని అన్నారు. రైతులు నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు ఇలా అందరినీ ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని ఎంత మేరకు నిర్వీర్యం చేయాలో.. అంత మేరకు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
ఏ వ్యవస్థలోనూ మార్పు తీసుకురాలేకపోయారని విమర్శించారు. రాష్ట్ర రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత కూడా ఆ పార్టీ నేతలకు లేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఫార్మా సిటీ ఉంటే కొడంగల్ లో ధర్నా ఎందుకు అని కేటీఆర్ ను ప్రశ్నించారు. అసలు కొడంగల్ లో కేటీఆర్ ధర్నా ఎందుకు చేశారో ఆయనకు అయినా తెలుసా అని ప్రశ్నించారు. పదేళ్లు అవినీతి, అక్రమాలు జరుగలేవా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు గొప్పలు చెప్పుకున్నారు తప్ప చేసింది ఏమి లేదని ఎద్దేవా చేశారు.