తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండ్రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, అదే సమయంలో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3.1 డిగ్రీల అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ తెలిపింది.
కాగా, తిరోగమన సమయం దగ్గరపడటంతో నైరుతి రుతుపవనాలు పుంజుకుంటున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నుంచి ఈ నెలాఖరు వరకు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని పేర్కొంది. దీంతో అక్టోబర్ మొదటి వారం వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. సెప్టెంబర్ 21 వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో సెప్టెంబర్ 22 నుంచి 28 వ తేదీ వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. అలాగే అక్టోబర్ 5, 6వ తేదీల్లో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అక్టోబర్ 6 నుంచి 12వ తేదీ మధ్యలో నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకునే అవకాశం ఉందని చెప్పింది.
రుతుపవనాలు పుంజుకోవడంతో దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు ఎల్లో, రెడ్ అలర్ట్‌లను జారీ చేశారు. పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయన్నారు. తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.