ఏపీకి మళ్లీ వర్షం ముప్పు… నేడు ఏర్పడనున్న అల్ప పీడనం

వరణుడు ఏపీని వదిలేలా లేడు. వరసగా అల్పపీడనాలు, వాయుగుండాలతో భారీవర్షాల కారణంగా ఏపీ తడిసి ముద్దవుతోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా, భారీ వరదల కారణంగా ఏపీకి ముఖ్యంగా రాయలసీమకు భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ విషాదం నుంచి ప్రజలు బయటపడకముందే.. మరో వర్షం ముప్పు ఏపీని వణికిస్తోంది. తాజాగా మరో అల్పపీడనం నేడు ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని… రేపు తీరం దాటే అవకాశం ఉందని తెలపింది. దీంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూర్, చిత్తూర్, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్రం తెలపింది. కాగా అల్పపీడనం ఏర్పడిన తరువాత క్రమంగా తమిళనాడు వైపు కదులుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తాయని.. దీంతో ఇవ్వాళ, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది.