తెలుగు రాష్ట్రాలను వరణులు వదలడం లేదు. గత పది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇటీవలే అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలో మరి కొద్ది రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ద్రోణి, ఉత్తర అంతర్గత తమిళనాడు మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి, గంగా పరివాహక ప్రాంత పశ్చిమ బెంగాల్ వరకు ఆంధ్ర, ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో పాటు అల్పపీడనం బలపడుతోంది. అండమాన్ తీరం నుంచి తమిళనాడు వైపు పశ్చిమ వాయువ్య తీరంవైపు అల్పపీడనం కదులుతోంది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చిరించింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి.