వాయు’గండం‘ తమిళనాడు జిల్లాల్లో రెడ్ అలెర్ట్

-

తమిళనాడులో భారీ వర్షాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వారం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో వర్షాల కారణంగా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు 15 జిల్లాలకు రెడ్ అలెర్ట్ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలంగా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమైంది. గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

వాయుగుండం ప్రభావంతో చెన్నైలో భారీ వర్షం పడనుంది. చెన్నై నగర వాసులు రెండు రోజులు బయటకు వెళ్లవద్దని అధికారుల ఆదేశించారు. చెన్నై, కాంచీపురం, తిరవల్లూర్, చెంగల్ పట్టు, విల్లుపురం, పుదుకొట్టై, తిరు నల్వేలి, కన్యాకుమారి, మధురై, రామనాథపురం, శివగంగై జిల్లాలకు భారీ వర్షం ముప్పు ఉందని వాతావారణ శాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా 12 జిల్లాల్లో నేడు, రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.  భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని కావేరి, వైగై, థెన్-పెన్నై, భవానీ  నదులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news