ఆ ఒక్క సీన్​ అలా తీసి ఉంటే… బాహుబలి మరో రేంజ్​లో ఉండేది

‘బాహుబలి’ తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చేసిన చిత్రం. రూ.100కోట్లు వసూలు చేయడం గొప్పగా చెప్పుకునే సందర్భంలో రూ.1000కోట్ల మార్కును దాటేసి, రికార్డులు తిరగరాసింది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ల నటన.. రాజమౌళి టేకింగ్‌, ఎం.ఎం.కీరవాణి సంగీతం, సెంథిల్‌ కెమెరావర్క్‌ ఇలా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. జులై 10, 2015న విడుదలైన ‘బాహుబలి:ది బిగినింగ్‌’ ఆదివారంతో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి ఓ సందర్భంలో రాజమౌళి పంచుకున్న ఆసక్తికర విషయాలు..

రాజమౌళి
రాజమౌళి

ఇంటర్వెల్‌ సీన్‌ అలా తీద్దామనుకున్నారు… ప్రస్తుతం ఉన్న సినిమాలో బాహుబలి విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్‌ వస్తుంది. కానీ, తొలుత వేరే సన్నివేశం వద్ద ఇంటర్వెల్‌ వేద్దామనుకున్నారు జక్కన్న. ‘‘మాహిష్మతి ఊపిరి పీల్చుకో. నా కొడుకు వచ్చాడు. బాహుబలి తిరిగొచ్చాడు’ అని దేవసేన అన్నప్పుడు శివుడు నడుచుకుంటూ వస్తుంటే అతడిలో నుంచి బాహుబలి ఫిగర్‌ రావడంపై ఇంటర్వెల్‌ ఇవ్వాలి. దాని కన్నా ముందు శివుడు రకరకాల దశలు భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం ఇలా పంచభూతాలను దాటుకుంటూ మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు. కానీ, ఈ సన్నివేశాన్ని ఇలా తీద్దామనుకోలేదు. శివుడు మాహిష్మతిలోకి వచ్చే ముందు మంచు కొండల్లో సైనికులతో పోరాటం చేస్తాడు. అప్పుడు అక్కడ ఒక సైనికుడు శివుడిని చూసి బాహుబలి అనుకుంటాడు. ‘ప్రభూ.. నన్ను ఏమీ చేయొద్దు’ అని వేడుకుంటాడు. అతడు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి, బిజ్జలదేవుడికి విషయం చెబుతాడు. కానీ, బిజ్జలదేవుడు నమ్మడు. ‘బాహుబలి చచ్చిపోయాడు. వాడి ప్రాణాలను నలిపి నలిపి మట్టిలో కలిపేశాం’ అని అనగానే ఇటువైపు మట్టి గోడను బద్దలు కొట్టుకుని శివుడు రావాలి. ‘వాడి శరీరాన్ని మంటల్లో కలిపేశాం’ అనగానే అగ్ని కీలలను దాటుకుంటూ రావాలి. ఇలా బిజ్జలదేవుడు చెప్పే ఒక్కో డైలాగ్‌కు ఒక్కో దశను దాటుకుంటూ వచ్చేలా తీద్దామనుకున్నాం. ఇక్కడ ఇంటర్వెల్‌ వేద్దామనుకున్నాం. కానీ, విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్‌ వేస్తే బాగుంటుందని భావించి బిజ్జలదేవుడి డైలాగ్స్‌ అన్నీ తీసేశాం. శివుడి మాహిష్మతికి బయలుదేరే సన్నివేశాలను ‘నిప్పులే శ్వాసగా’ అంటూ సాంగ్‌లా తీశాం.’’ అంటూ రాజమౌళి ఓ సందర్భంలో పంచుకున్నారు.

రాజమౌళి
రాజమౌళి

కోతిని పెట్టేందుకు అనుమతిలేక.. ‘బాహుబలి-1’లో శివుడితో పాటు ఓ కోతిని కూడా పెట్టాలని రాజమౌళి అనుకున్నారట. జలపాతం దగ్గర కొమ్మను పట్టుకునేందుకు దూకినప్పుడు మొదటిసారి శివుడు కింద పడిపోతాడు. కానీ, కోతి మాత్రం దూకేసి పైకి వెళ్లిపోయి, కొన్ని రోజులకు నగల మూటతో కిందకు వస్తుందని, ఆ నగలను చూసి అవంతిక రూపాన్ని శివుడు చెక్కుతాడని సన్నివేశం రాసుకున్నారు. కానీ, కోతిని పెట్టి సినిమా తీయడం నిబంధనల విరుద్ధం. కోతిని సీజేలో షూట్‌ చేసినా, కొన్ని సన్నివేశాల్లో నేచురల్‌గా ఉండేందుకు నిజమైన కోతిని పెట్టాల్సిందే. అయితే, అమెరికాలో శిక్షణ తీసుకున్న ఓ కోతిని కూడా సినిమా కోసం బుక్‌ చేశారట రాజమౌళి. ఇక్కడి కోతి అయినా, అమెరికా కోతి అయినా, నిబంధనలు ఒకటేనని సెన్సార్‌ వాళ్లు చెప్పడంతో ఆ నిర్ణయం విరమించుకుని అవంతిక మాస్క్‌ ఐడియాను డెవలప్‌ చేశారు. అలా జలపాతం నుంచి పడిన మాస్క్‌ను ఊహించుకుని ఇసుకపై బొమ్మగీస్తాడు శివుడు. ఆ తర్వాత అదే ఊహతో జలపాతం పైకి వెళ్తాడు.