టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. దర్యాప్తులో పోలీసులకు కీలక ఆధారం లభించింది. రెండోసారి పోలీసు కస్టడీలోకి తీసుకొన్న ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి, డాక్యానాయక్, రాజేంద్రనాయక్‌ల నుంచి సోమవారం కీలక వివరాలు రాబట్టినట్టు సమాచారం.
కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకరలక్ష్మి డైరీ నుంచి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తస్కరించినట్టు పోలీసులు తాజాగా నిర్ధారణకు వచ్చారు. ఆమె డైరీ నుంచి పాస్‌వర్డ్ కొట్టేసి గతేడాది అక్టోబరు 1న ఆమె కంప్యూటర్‌లోని ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసినట్టు రాజశేఖర్‌రెడ్డి అంగీకరించినట్టు సమాచారం. కొన్ని ప్రశ్నపత్రాలను ప్రవీణ్‌కుమార్ పెన్‌డ్రైవ్‌లోకి మార్చినట్టు వెల్లడించినట్టు తెలుస్తోంది. బడంగ్‌పేట్‌లోని ప్రవీణ్ కుమార్ నివాసంలో తనిఖీ చేసిన సిట్ పోలీసులు రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
నిందితుల నుంచి సేకరించిన ఫోన్ నంబర్ల ఆధారంగా అనుమానితుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. వారిలో ఇప్పటివరకూ ఆరుగురిని గుర్తించి ప్రశ్నించారు. మరో ముగ్గురి సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్ అయినట్టు గుర్తించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఈ ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు అంచనాకు వచ్చారు. వీరికి ప్రశ్నపత్రాల లీకేజీతో ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నారు.