వడదెబ్బతో మృతి చెందిన ఓ విద్యార్థి కుటుంబానికి ఓ అమెరికా యూనివర్సిటీ భారీ పరిహారం చెల్లించుకుంది. తమ కుమారుడి మరణానికి ఆ యూనివర్సిటీ యాజమాన్యమే కారణమంటూ బాధిత కుటుంబం ఆరోపించడంతో సదరు యూనివర్సిటీ 14 మిలియన్ డాలర్ల( భారత కరెన్సీలో రూ.110 కోట్లు) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఇంతకీ ఏం జరిగింది అంటే..?
అమెరికాలోని కెంటకీ విశ్వవిద్యాలయంలో 2020లో రెజ్లింగ్‌కు సంబంధించి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బ్రేస్ అనే 20 ఏళ్ల యువకుడు పాల్గొన్నాడు. శిక్షణలో అలసిపోయిన బ్రేస్ అస్వస్థతకు గురయ్యాడు. దాహం తీర్చుకోవడం కోసం అక్కడున్నవారిని అభ్యర్థించాడు. అందుకు అక్కడున్న కోచ్‌లు నిరాకరించారు. శిక్షణలో భాగం అంటూ ఇంకెవరూ అతడికి నీటిని ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో డీహైడ్రేషన్‌కు గురైన బ్రేస్ కాసేపటికే మరణించాడు.
తన కుమారుడి మరణానికి యూనివర్సిటీ యాజమాన్యమే కారణమంటూ బ్రేస్ కుటుంబ సభ్యులు కోర్టులో దావా వేశారు. బాధిత కుటుంబానికి 14 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఆ రోజు సెషన్‌లో పాల్గొన్న ఇద్దరు కోచ్‌లు రాజీనామా చేసినట్లు యూనివర్సిటీ తెలిపింది.