సాల్వ్ చేయాల్సిన ఓ మిస్టరీ.. దాని వెనుక పరిగెత్తే ప్రధాన పాత్రలు.. కథలో ఇవి ఉంటే చాలు.. ఏ థ్రిల్లర్ సినిమా అయినా హిట్ అవుతుంది. ఈ కథను తెరపై ఎంత ఉత్కంఠ భరితంగా చెబితే.. మూవీ అంత ఎక్కువ ప్రేక్షకాదరణ పొందుతుంది. సరిగ్గా ఇదే తరహాలో వచ్చిన తమిళ చిత్రమే రాచ్చసన్.
మూవీ: రాక్షసుడు
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల, కాశీ విశ్వనాథ్, కేశవ్ దీపక్, రవిప్రకాష్ తదితరులు
సంగీతం: జిబ్రాన్
కథ, స్క్రీన్‌ప్లే: రామ్‌కుమార్
నిర్మాత: కోనేరు సత్యనారాయణ
దర్శకత్వం:రమేష్ వర్మ
సాల్వ్ చేయాల్సిన ఓ మిస్టరీ.. దాని వెనుక పరిగెత్తే ప్రధాన పాత్రలు.. కథలో ఇవి ఉంటే చాలు.. ఏ థ్రిల్లర్ సినిమా అయినా హిట్ అవుతుంది. ఈ కథను తెరపై ఎంత ఉత్కంఠ భరితంగా చెబితే.. మూవీ అంత ఎక్కువ ప్రేక్షకాదరణ పొందుతుంది. సరిగ్గా ఇదే తరహాలో వచ్చిన తమిళ చిత్రమే రాచ్చసన్. దీన్ని తెలుగులో రాక్షసుడుగా రీమేక్ చేశారు. ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరికొత్త పాత్రలో మనకు కనిపిస్తాడు. మరి గత కొంత కాలంగా హిట్లు లేక ఇబ్బంది పడుతున్న బెల్లంకొండ సాయి ఈ మూవీతోనైనా హిట్ కొట్టాడా..? రీమేక్‌గా మన ముందుకు వచ్చిన రాక్షసుడు మూవీ ప్రేక్షకుల్ని ఏ మేర ఆకట్టుకుంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
కథ…
అరుణ్ (బెల్లంకొండ శ్రీనివాస్)కు సినీ దర్శకుడు కావాలన్నది కల. ఈ క్రమంలోనే అతను సినిమా కథలు పట్టుకుని నిర్మాతల చుట్టూ తిరుగుతుంటాడు. అయితే దర్శకుడు అవ్వాలనే ఆశ నెరవేరదు. దీంతో అతను కుటుంబ సభ్యులు కోరినట్లుగా పోలీస్ ఉద్యోగంలో చేరుతాడు. ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. అదే సమయంలో నగరంలో యువతులు వరుసగా అదృశ్యమవుతుంటారు. వారు అత్యంత దారుణంగా హత్యలకు గురవుతుంటారు. ఈ క్రమంలోనే ఈ కేసులకు సంబంధించి అరుణ్ కీలకమైన ఆధారాలను సేకరిస్తాడు. అందులో భాగంగానే యువతులను ఎవరు హత్య చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో కారణాలను తెలుసుకునే పనిలో పడతాడు. అయితే పోలీస్ శాఖలో ఉండే ఉన్నతాధికారుల వల్ల అతను తన దర్యాప్తును సజావుగా చేయలేకపోతుంటాడు. అదే సమయంలో సాక్షాత్తూ తన మేనకోడలునే ఎవరో కిడ్నాప్ చేసి హత్య చేస్తారు. ఈ క్రమంలో అరుణ్ అసలు ఏం చేస్తాడు ? అతను పోలీసు వృత్తి పరంగా ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటాడు ? చివరకు హత్యలు చేసే వ్యక్తిని పట్టుకుంటాడా ? లేదా ? ఆ హత్యలు చేసే వ్యక్తి వెనుక ఉన్న కథేమిటి ? అనే వివరాలను తెలుసుకోవాలంటే రాక్షసుడు మూవీని తెరపై చూడాల్సిందే.
రాక్షసుడు మూవీ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన చిత్రం. అయితే ఆ జోనర్ తాలూకు ఉత్కంఠ మనకు సినిమాలో కనిపిస్తుంది. మూవీ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. అనేక చిక్కుముడులు, మలుపులతో మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా హత్యలు చేసే ఓ సైకోను ఓ యంగ్ ఆఫీసర్ ఎలా మట్టుబెట్టాడన్నదే ప్రధానంగా సినిమా కథ సాగుతుంది. ఈ కథ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది కనుక ప్రేక్షకులు కూడా బాగానె కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా ఒక్కో చిక్కుముడిని విప్పుతూ హీరో పాత్ర చివరకు కిల్లర్‌ను కనిపెట్టే విధానం బాగుంటుంది.
హత్యలు చేస్తున్నది సైకో కిల్లర్ అనే విషయం ప్రేక్షకులకు ఫస్టాఫ్‌లోనే తెలుస్తుంది. అయినప్పటికీ అసలు కిల్లర్ ఎవరు అనే విషయం మాత్రం వారికి మూవీ సెకండాఫ్‌లోనే తెలుస్తుంది. ఈ క్రమంలో అసలు కిల్లర్ ఎవరనే విషయాన్ని చివరి వరకు సస్పెన్స్‌లో పెట్టి దర్శకుడు ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తాడు. ఇక మూవీలో అమ్మాయిల తల్లిదండ్రులకు మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ప్రస్తుత తరుణంలో పిల్లల క్షేమం పట్ల తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో మూవీలో వివరించారు. ఇక మూవీలో కుటుంబ సభ్యుల మధ్య ఉండే భావోద్వేగాలు, సెంటిమెంట్ సన్నివేశాలను బాగా చూపించారు. ప్రేక్షకులను ఈ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రాక్షసుడు మూవీ రీమేక్ అయినప్పటికీ చూస్తుంటే ఎక్కడా ఆ ఫీలింగ్ రాదు. తెలుగు నేటివిటీకి తగినట్లే మూవీని నిర్మించారు.
నటీ నటుల పనితీరు…
రాక్షసుడు చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఎస్ఐ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. అద్భుతంగా నటించాడు. పలు సెంటిమెంట్ సన్నివేశాల్లోనూ శ్రీనివాస్ తనదైన శైలిలో నటించాడు. అరుణ్ ప్రేమికురాలిగా అనుపమ పరమేశ్వరన్ కూడా బాగానే నటించింది. పాత్ర చిన్నదే అయినా చక్కగా నటించింది. అలాగే రాజీవ్ కనకాల, కాశీ విశ్వనాథ్, విలన్ పాత్రలో శరవణన్‌లు అద్భుతంగా నటించారు. సినిమాకు గాను వెంకట్ సి దిలీప్ అందించిన ఫొటోగ్రఫీ, జిబ్రాన్ సంగీతం ప్రేక్షకులను అలరిస్తాయి. దర్శకుడు రమేష్ వర్మ రీమేక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు మనకు మూవీని చూస్తే తెలుస్తుంది. కథను ఎక్కడా పట్టుతప్పకుండా దర్శకుడు అద్భుతంగా నడిపిస్తాడు. ఇక చక్కని ప్రొడక్షన్ విలువలతో మూవీని నిర్మించారు. టెక్నికల్‌గా కూడా మూవీ అద్భుతంగా వచ్చింది.
థ్రిల్లర్ జోనర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా ఆశించినంత వినోదాన్ని ఇస్తుంది. మూవీ ఎక్కడా బోర్ కొట్టదు. ఇక కథ కూడా చాలా ఉత్కంఠగా సాగుతుంది. అయితే ఈ మూవీని రీమేక్ అని కాకుండా చూస్తే ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేయవచ్చు. ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఎంతో కాలంగా హిట్ లేక సతమతం అవుతున్న బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఈ మూవీ చక్కని విజయాన్ని అందించిందనే చెప్పవచ్చు. ప్రేక్షకులు ఈ మూవీకి వెళ్తే 100 శాతం థ్రిల్లింగ్ అనుభూతి చెందుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు..!