ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల తండ్రి, యాంకర్ సుమ మామ దేవదాస్ కనకాల కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల తండ్రి, యాంకర్ సుమ మామ దేవదాస్ కనకాల కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. దేవదాస్ కనకాల నటుడిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలను, నటులను ఆయన పరిచయం చేశారు. తన ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో ఎంతో మందిని నటులుగా తీర్చిదిద్దారు. చాలా మంది ప్రముఖ హీరోలు ఒకప్పుడు ఆయన యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నారు.
దేవదాస్ కనకాలకు చెందిన ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో.. రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, నాజర్, ప్రదీప్ శక్తి, భాను చందర్, అరుణ్ పాండ్యన్, రాంకీ, రఘువరన్ తదితర ప్రముఖ నటులు ఒకప్పుడు శిక్షణ పొందారు. అలాగే చాలా మంది దర్శకులు కూడా ఆయన వద్ద శిక్షణ తీసుకున్నారు. కాగా 1945 జూలై 30వ తేదీన యానాంలో దేవదాస్ కనకాల జన్మించారు. ఆయన స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట.
వైజాగ్‌లోని ఏవీఎన్ కాలేజీలో దేవదాస్ కనకాల డిగ్రీ చదివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు. ఆ తరువాత సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్‌లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. కాగా దేవదాస్ కనకాల సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును పొందారు. ఒకప్పటి ప్రముఖ టీవీ నటులు కూడా ఈయన వద్దే శిక్షణ పొందారు. దేవదాస్ కనకాల దర్శకుడిగా కూడా పేరుగాంచారు. కాగా 2 సంవత్సరాల కిందట ఆయన భార్య మరణంతో ఆయన తీవ్రంగా కుంగిపోయారు. ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 74 ఏళ్లు కాగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఇవాళ కన్నుమూశారు.