బొండా ఉమా తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఆ పోస్టు వల్ల ఆయన పార్టీ మారుతారని బాగా వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు అటు సోషల్ మీడియాలోనూ పలు కథనాలు వస్తున్నాయి.
ఏపీలో ప్రస్తుతం చాలా మంది రాజకీయ నాయకులు వలసల బాట పడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లే నేతల సంఖ్య పెరిగిపోతోంది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు ఇటీవలే బీజేపీలో చేరగా.. పలువురు మాజీ ఎమ్మెల్యేలు, చోటా మోటా నేతలు కూడా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి కూడా జోరుగా వలసలు పెరుగుతాయని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర్ రావు పార్టీ మారుతారంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆయన వైసీపీలో చేరనున్నారని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది.
బొండా ఉమా త్వరలో వైసీపీలో చేరనున్నారని సోషల్ మీడియాలో ఓ వైపు ప్రచారం జరుగుతుండగా.. అందులో ఆయన పెడుతున్న పోస్టులు కూడా అందుకు ఊతమిస్తున్నాయి. ప్రస్తుతం బొండా ఉమా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా తాజాగా ఆయన అక్కడ బంగీ జంప్ చేశారు. అనంతరం ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో బెజవాడ ప్రజలు తన తదుపరి రాజకీయ అడుగుపైనే చర్చించుకుంటున్నారని, కానీ తాను ఇప్పుడు వేయబోతున్న అడుగు ఇది.. అంటూ బంగీ జంప్ థ్రిల్‌ను అందుకోబోతున్నా..అని ట్వీట్ చేశారు. దీంతో ట్విట్టర్లో బొండా ఉమా చేసిన పోస్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
While Bezawada is busy debating at my next political move, I took a leap of faith into an awesome Bunjee Jump experience!!! Cheers! pic.twitter.com/VOW0OTdP31
— Bonda Uma (@Bondauma_MLA) August 1, 2019
బొండా ఉమా తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఆ పోస్టు వల్ల ఆయన పార్టీ మారుతారని బాగా వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు అటు సోషల్ మీడియాలోనూ పలు కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉమా టీడీపీని వీడడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే వైసీపీలో చేరితే తనకు ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తారనే అంశంపై కూడా ఆయన వైసీపీ అగ్రనాయకత్వంతో చర్చించారట. ఈ క్రమంలోనే విజయవాడ తూర్పు బాధ్యతలను బొండా ఉమాకు ఇస్తారని తెలుస్తోంది. అయితే ఈ డీల్‌కు అంగీకరించిన బొండా ఉమ నేడో రేపో వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. మరోవైపు తాను పార్టీ మారుతానని వస్తున్న వార్తలను బొండా ఉమా ఖండించడం లేదు కూడా. దీన్ని బట్టి చూస్తే ఆయన పార్టీ మారడం దాదాపుగా ఖాయమైందనే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే నిజంగానే బొండా ఉమా టీడీపీని వీడితే అది చంద్రబాబుకు భారీ షాక్ ఇస్తుందనే చెప్పవచ్చు..!