గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, వ్యాపార,పారిశ్రామిక దిగ్గజాలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా, రతన్ టాటా మృతి నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం ఏకనాథ్ షిండే సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదిలాఉండగా, పారిశ్రామికవేత్త రతన్ టాటా భౌతికకాయాన్ని ఎన్సీపీఏ లాన్స్‌కు తరలించారు. అక్కడ ప్రముఖుల సందర్శనార్ధం ఆయన భౌతిక కయాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు జరగనున్నాయి. రతన్ టాటా అకాల మరణం పట్ల దేశ ప్రజలు ఆయనకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.