భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ వచ్చేశాడు. ఎట్టకేలకు గత కొద్ది రోజులుగా భారత జట్టుకు కొత్త కోచ్ గా ఎవరు ? వస్తారు అన్న దానిపై పెద్ద ఉత్కంఠ నెలకొంది. అయితే అందరి అంచనాలకు అనుగుణంగానే మరోసారి భారత క్రికెట్ జట్టు కోచ్ గా టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రిని ఎంపిక చేసింది. రవిశాస్త్రినే కోచ్ గా కొనసాగించాలని సీఏసీ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. కపిల్‌దేవ్ నేతృత్వంలోని సీఏసీ సమావేశం శుక్రవారం ముంబైలోని బిసిసిఐ కేంద్ర కార్యాలయంలో జరిగింది.
ఈ భేటీకి ఈ కమిటీ సభ్యులు అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి కూడా హాజరయ్యారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐలో పనిచేసేందుకు, టీమిండియా హెడ్ కోచ్ పదవికి భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2 వేల మంది ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. చివరకు సీఏసీ తీవ్రంగా వడపోసి ముందుగా ఆరుగురిని ఫైనల్ చేయాలని భావించింది.
చివరకు తీవ్ర తర్జన భర్జనల అనంతరం సీఏసీ ముగ్గురిని ఫైనల్ చేసింది. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితోపాటు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మైక్ హెసన్, ఆస్ట్రేలియాకు చెందిన టామ్ మూడీ లిస్టులో ఉన్నారు. టామ్ మూడీకి కొద్ది సంవత్సరాలుగా కోచ్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ క్రమంలోనే రవిశాస్త్రికి టామ్ మూడీ నుంచి గట్టి పోటీయే ఎదురైంది.
ఇక వీరితో పాటు టీమిండియా మాజీ ఆటగాళ్లు లాల్ చంద్ రాజ్‌పుత్, రాబిన్ సింగ్ కూడా రేసులో నిలిచారు. అయితే, చివరకు కపిల్ దేవ్ టీమ్ మాత్రం రవిశాస్త్రికే ఓటేసింది. ఏదేమైనా మరోసారి రవిశాస్త్రి భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా కంటిన్యూ కానున్నారు.