దేశంలో కరోనా మహమ్మారి ప్రస్తుతం మరింత ఉగ్రరూపం దాల్చింది. దేశవ్యాప్తంగా నిత్యం 20వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. రికవరీ రేటు మెరుగు పడుతున్నా.. అదే సమయంలో కొత్త కేసులు కూడా వస్తుండడం కలవరపెడుతోంది. అయితే కరోనా లాక్‌డౌన్ ఆరంభంలో పేద, మధ్యతరగతి వర్గాలు, చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఊరట కలిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 3 నెలల పాటు మారటోరియం సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. మార్చి, ఏప్రిల్, మే నెలల కాలానికి గాను మారటోరియం తీసుకున్నారు. తరువాత కరోనా ప్రభావం తగ్గకపోవడంతో దాన్ని మరో 3 నెలలు పెంచారు.
జూన్, జూలై, ఆగస్టు నెలలకు ఆర్‌బీఐ మారటోరియంను పొడిగించింది. ఈ క్రమంలో ఈ దఫా మారటోరియం మరో నెల అయితే ముగుస్తుంది. అయితే కరోనా ప్రభావం ఇంకా తగ్గని దృష్ట్యా మారటోరియాన్ని ఈ సారి మరో 4 నెలలు అంటే.. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల వరకు పొడిగించాలని అంటున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం పూర్తిగా తగ్గలేదు. దీనికి తోడు రోజు రోజుకీ నిరుద్యోగం పెరిగిపోతోంది. ఉద్యోగాలు చేస్తున్నవారికి కూడా వేతనాలు సకాలంలో అందడం లేదు. మరోవైపు కరోనా భయం, ఇతర ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ప్రస్తుతం ఈఎంఐలు, బిల్లు చెల్లింపులు చేసే స్థితిలో చాలా మంది లేరు. అందువల్ల మారటోరియంను డిసెంబర్ వరకు పొడిగించాలనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం ఉన్న మారటోరియం ఆగస్టుతో ముగుస్తున్నందున.. ఆ నెల చివరి వరకు ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. లేదా ఆగస్టు రెండో వారంలోనే మారటోరియంపై ప్రకటన ఉండవచ్చని సమాచారం. ఇప్పటికే కరోనా దెబ్బకు దేశంలో చాలా మంది ఈఎంఐలు చెల్లించలేని డిఫాల్టర్లుగా మారారు. ముందు ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో మారటోరియం సదుపాయాన్ని పొడిగించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.