కాస్త గ్యాప్ ఇచ్చిన వరణుడు మళ్లీ సోమవారం రోజున ఊపందుకున్నాడు. ఇక మంగళవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ క్రమంలోనే.. ఉమ్మడి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాసం ఏర్పాటు చేయాలని, ప్రజలకు రేషన్ ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేసింది.
వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది. రహదారుల్లోని కల్వర్టుల మీదుగా ఉద్ధృతంగా ప్రవహించే వరదలోంచి వెళ్లేందుకు వాహనదారులు ఎలాంటి సాహసం చేయొద్దని చెప్పింది. చేపల వేటకు దూరంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని కేవీకే మల్యాల ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.మాలతి అన్నారు. ఆరుతడి పంటలైన పత్తి, కంది, మొక్కజొన్న, పెసర, మినుమతో పాటు వరి, మిరప సాగు చేస్తున్న పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా బయటికి పంపించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. నీరు నిల్వ, తేమ ఉన్న పంటల్లో ఎరువులను వేయొద్దని సూచించారు.