అధిక బరువు త్వరగా తగ్గాలనుకుంటున్నారా? మీ సమాధానం అవును అయితే మీరు మీ నిత్య ఆహారపు అలవాట్లలో పలు మార్పులు చేసుకోవాల్సిందే. సాధారణంగా మనకు క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాలపైనే మక్కువ ఎక్కువగా ఉంటుంది. అయితే అధిక క్యాలరీలు ఉండే ఆహారాలు బరువు పెంచుతాయని మాత్రం చాలా మంది గ్రహించలేరు. దీంతో అధికంగా బరువు పెరుగుతుంటారు. ఈ క్రమంలో పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం నానా అవస్థలు పడుతుంటారు. అయితే డైట్‌లో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉండేలా చూసుకుంటే చాలు, బరువు తగ్గవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాల్లో శనగలు కీలక పాత్ర పోషిస్తాయి.
శనగలను రోస్ట్ చేసి తీసుకుంటే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. కొద్దిగా వేయించిన శనగలను నిత్యం తినడం వల్ల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. శనగల్లో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అంత త్వరగా జీర్ణం కావు. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా తిండిపై ఆసక్తి తగ్గుతుంది. తద్వారా తక్కువ ఆహారం తీసుకుంటారు. దీంతో బరువు తగ్గవచ్చు.
శనగల్లో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. కనుక వీటిని నిత్యం ఆహారంలో తీసుకోవచ్చు. ముఖ్యంగా టీ టైంలో బిస్కెట్లు తినే బదులు శనగలు తింటే చక్కని ఫలితం ఉంటుంది. ఆకలి అనిపించినప్పుడు కొన్ని శనగలు తింటే ఆకలి వేయదు. దీనికి తోడు శనగల వల్ల పెద్దగా క్యాలరీలు కూడా మనకు అందవు కనుక శనగలను అధిక బరువుకు చెక్ పెట్టే సూపర్ ఫుడ్‌గా చెప్పవచ్చు. అలాగే శనగల్లో ఉండే ప్రోటీన్లు మన శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఇక వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. మలబద్దకం సమస్య నుంచి బయట పడాలంటే శనగలను రోజూ తినాలి..!