విజయవాడలోని ముంపు గ్రామాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. గత ఆరు రోజులుగా విజయవాడలోనే ఉంటున్న సీఎం.. కలెక్టరేట్ లో మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు.వరద ప్రాంతాల్లో పారిశుధ్య పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లలో త్వరగా క్లీనింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గండ్లు పూడ్చివేత పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో భారత ఆర్మీ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం పనితీరును అడిగి తెలుసుకున్నారు. బుడమేర కాలువకు పడిన మూడో గండిని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరెంట్ సరఫరా, టెలిఫోన్ సిగ్నల్స్ పునరుద్ధరణ, ట్యాంకర్లతో తాగునీటి సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిత్యావసరాల పంపిణీపైనా ఆరా తీసినట్లు తెలుస్తోంది. వాహనాలు, ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో టెక్నిషియన్లు పిలిపించి రిపేర్లు చేయించాలని ఆదేశించారు.