తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు : రిషి సునాక్

-

బ్రిటన్‌ ప్రధాని పీఠం కోసం కన్జర్వేటివ్ నేతలు రిషి సునాక్‌, లిజ్‌ట్రస్ మధ్య పోరు తీవ్రంగా సాగుతోంది. దేశ ప్రజలను ఆకట్టుకునే ఎత్తుగడలతో విజయ తీరాలకు చేరేందుకు వీళ్లిద్దరూ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో వార్తా సంస్థ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషి సునాక్‌ మాట్లాడారు.

ఆర్థిక సంక్షోభాన్ని  ఎదుర్కొనేందుకు తప్పుడు వాగ్దానాలతో విజయం సాధించడం కంటే ఓడిపోవడం మేలని రిషి అభిప్రాయపడ్డారు. అలాగే జీవన వ్యయాలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కుటుంబాలను ఆదుకోవడానికి తాను కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా వెల్లడించారు.

తన ప్రత్యర్థి లిజ్‌ట్రస్ పన్నుల్లో కోతలు విధిస్తానంటూ ఇచ్చిన హామీ గురించి రిషి సునాక్‌ ప్రస్తావించారు. దీనివల్ల అవసరంలో ఉన్నవారి కంటే ధనవంతులకే మేలు జరుగుతుందన్నారు. ‘ఇలాంటి తప్పుడు వాగ్దానాలతో నేను గెలవడం కంటే ఓడిపోవడమే మేలు. ఈ గడ్డు పరిస్థితుల్లో ప్రజలకు సహకరించాలని  నిశ్చయించుకున్నాను. ప్రజల డబ్బు తీసుకోకుండా ఉండేందుకే నేను ప్రాధాన్యత ఇస్తాను’ అని వెల్లడించారు.

అలాగే కొవిడ్ సమయంలో బోరిస్ జాన్సన్ హయాంలో ఆర్థిక మంత్రిగా తీసుకున్న నిర్ణయాలను మరోసారి ప్రస్తావించారు. తాను తీసుకున్న నిర్ణయాలపై ప్రజలు తీర్పు ఇస్తారన్నారు. తాను ప్రధానమంత్రిగా ఎన్నికైతే ..ఇప్పటికే చెప్పినవాటికంటే మెరుగైన నిర్ణయాలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ‘ప్రజలు ద్రవ్యోల్బణం గురించి ఆందోళన చెందుతున్నారు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీల గురించి కంగారు పడుతున్నారు. ప్రధాని అయితే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి మరిన్ని తగిన నిర్ణయాలు తీసుకుంటాను. నేను గతంలో కొన్ని చర్యలు ప్రకటించాను. కానీ అప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం పరిస్థితి దిగజారింది. అందుకు తగిన విధంగా ముందుకు వెళ్తాను’ అని చెప్పారు.

ఇదిలా ఉండగా.. ప్రధాని రేసులో రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇప్పటివరకు వెలువడిన సర్వేల ప్రకారం సునాక్‌ కంటే ట్రస్‌ మెజార్టీలో ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీల్లో సునాక్‌కు అధిక మద్దతు ఉన్నప్పటికీ.. టోరీల్లో ఎక్కువ మంది ట్రస్‌ వైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అయితే, ఇటీవల జరిగిన ఓ టీవీ డిబేట్‌లో అనూహ్యంగా ట్రస్‌పై సునాక్‌ విజయం సాధించడం గమనార్హం. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉందని ట్రస్‌ చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వచ్చింది. అది సునాక్‌కు అనుకూలంగా మారింది.  ఈ ఎన్నికల్లో ద్రవ్యోల్బణం, అధిక ధరలు అభ్యర్థుల మధ్య ప్రధానాంశాలుగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news