బీహార్ అసెంబ్లీలో రణరంగం..స్పీకర్‌ను చాంబర్‌లో బంధించిన ఎమ్మెల్యేలు

-

బీహార్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. కొత్త పోలీస్ చట్టంపై విపక్షాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. స్పీకర్‌ను నిర్బంధించడం, మార్షల్స్‌ ఎంట్రీతో సభలో టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పోలీస్ చట్టం వివాదానికి దారి తీసింది. స్పీకర్‌ను చాంబర్‌లో బంధించడంతో అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. విపక్ష సభ్యులను మార్షల్స్‌ బలవంతంగా బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పలువురు సభ్యులు గాయపడ్డారు. స్పీకర్ చాంబర్‌ వద్ద మహిళా ఎమ్మెల్యేలు ఉండటంతో ఉమెన్స్ టీమ్స్‌ను రప్పించాల్సి వచ్చింది.

పోలీస్ యాక్ట్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి విపక్ష పార్టీలు. దీనిపై అసెంబ్లీలోనూ రచ్చ కొనసాగింది. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానం ఇచ్చాయి. స్పీకర్‌ తిరస్కరించడంతో విపక్ష సభ్యులు సభలో నిరసనకు దిగారు. నితీశ్‌ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది.

తేజస్వియాదవ్‌ నేతృత్వంలో ఆజాద్ మైదాన్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి విపక్ష పార్టీలు. అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన తేజస్వియాదవ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు ప్రతిఘటించారు. దీంతో పోలీసులు వాటర్‌ కెనాన్స్‌ను ప్రయోగించి వారిని చెదరగొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.బీహార్‌లో ఈ తరహా రాజకీయం చూసి చాలా రోజులైంది. మొత్తానికి నితీశ్‌ సర్కార్‌కు చుక్కలు చూపించారు విపక్ష ఎమ్మెల్యేలు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news