రంజాన్‌కు ముందు ముస్లిం కుటుంబంలో తీవ్ర విషాదం

గుంటూరు: రంజాన్‌కు ముందు ముస్లిం కుటుంబంలో విషాదం నెలకొంది. మరో రెండు రోజుల్లో పండుగను ఘనంగా చేసుకుందామనుకున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం మింగేసింది. గమ్యానికి చేరకుండా వారిని అతంతలోకాలకు తీసుకెళ్లింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు షేక్ చినహుస్సేన్ (55), నూర్జహాన్ (45), హుస్సేన్ (25) ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. తాళ్లూరు నుంచి అమరావతి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ఇక ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. స్థానిక సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వానికి ఆస్పత్రికి తరలించారు. కారు ప్రయాణికులకు స్వల్ప గాయాలయినట్లు తెలుస్తోంది. వీరు మద్యం మత్తులో ఉన్నారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు, పాదాచారులు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్స్ రూల్స్ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా రోడ్డు ప్రమాదాలు తగ్గడంలేదని, అతివేగంగా వాహనాలు నడిపి కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చొద్దని పోలీసులు అంటున్నారు.