రోటీ ఆన్‌ వీల్స్‌.. వేడివేడి రొట్టెలతో నిరుపేదల కడుపు నింపుతున్న ఎన్జీవో

-

పోషకాహారం మాట పక్కనపెడితే సమాజంలో ఇప్పటికీ రెండు పూటలా కడుపు నింపుకోవడానికి సరిపడా తిండి దొరకని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా పొట్టకూటి నానా తిప్పలుపడే ఆభాగ్యులు అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంటారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌ నగరమూ అందుకు అతీతం కాదు. అందుకే అక్కడ రెక్కాడితేగానీ డొక్క నిండని స్థితిలో ఉన్న నిరుపేదల కడుపునింపడానికి ఓ స్వచ్ఛంద సంస్థ ‘రోటీ ఆన్‌ వీల్స్‌’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

రాజ్‌కోట్‌లోని ‘రాజ్‌కోట్‌ అర్హం యువ సేవా గ్రూప్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఫిబ్రవరి 8న ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద సంస్థకు చెందిన వాలంటీర్లు అప్పటికప్పుడే వేడివేడి రొట్టెలు తయారుచేసి ఇచ్చే ఆటోమేటిక్‌ మిషన్‌ను ఒక వాహనంలో పెట్టుకుని, ప్రతిరోజు రాజ్‌కోట్‌ పరిసరాల్లో వీధివీధికీ తిరుగుతారు. ఆకలితో తమ దగ్గరకు వచ్చేవారికి గరంగరం రొట్టెలతోపాటు భోజనం, పప్పు కూడా వడ్డిస్తారు.

స్థానిక సాధువు తవ్‌సామ్రాట్‌ రతన్‌లాల్‌జీ మహరాజ్‌ గౌరవార్ధం నిర్వహిస్తున్న ‘తవ్‌సామ్రాట్‌ ప్రసాదం’ పథకంలో భాగంగా తాము ‘రోటీ ఆన్‌ వీల్స్‌’ పేరుతో ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. రోటీ తయారీ కోసం తాము వినియోగిస్తున్న ఆటోమేటిక్‌ మిషన్‌ గంటకు 1000 రోటీలు తయారుచేస్తుందన్నారు. ఇలాంటి దాతలు ఉండబట్టే సమాజంలో ఆకలి చావుల సంఖ్య కొంతైనా తక్కువగా నమోదవుతుందేమో! అన్నదాతా సుఖీభవ.

Read more RELATED
Recommended to you

Latest news