అయోధ్యలో చేపట్టనున్న రామ మందిర నిర్మాణానికి రూ.1500 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో జనవరి 15వ తేదీన విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే భారీ ఎత్తున భక్తులు ఆలయ నిర్మాణానికి విరాళాలు అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మాట్లాడుతూ.. జనవరి 15వ తేదీన ప్రారంభమైన నిధి సేకరణ కార్యక్రమం ఫిబ్రవరి 27వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా 4 లక్షల గ్రామాలు, 11 కోట్ల కుటుంబాలను రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములను చేయదలిచాం. అందులో భాగంగానే ప్రస్తుతం నేను సూరత్‌లో ఉన్నా.. అని తెలిపారు.
ఆలయ నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.1511 కోట్ల విరాళాలు వచ్చాయని ఆయన తెలిపారు. కాగా నవంబర్ 9, 2019లో ఐదుగురు సభ్యులు ఉన్న సుప్రీం ధర్మాసనం రామ్ లల్లాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూట్ క్లియర్ అయింది. ఆ తరువాత రామ మందిర నిర్మాణ డిజైన్‌ను ఆవిష్కరించారు. అనంతరం గతేడాది ఆగస్టు 5న ప్రధాని మోదీ ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.