ఏపీ ఎన్నికల కమీషన్ పై తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల కమీషన్ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై మంత్రి కొడాలి నానీ స్పందించారు. ఎస్ఈసీ నోటీసులో పేర్కొన్న ఆరోపణలు అవాస్తవం, ఆ ఆరోపణలను ఖండిస్తున్నా అని అన్నారు. రాజ్యాంగబద్ద సంస్థలపై నాకు గౌరవం ఉంది అని చెప్తూ… ముఖ్యంగా ఎస్ఈసీ అంటే నాకు గౌరవం ఉందని అన్నారు. నా మాటల నిజమైన భావాన్ని ఎస్ఈసీ అర్థం చేసుకోలేదు అని ఆయన ఆవేదన చెందారు.
మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు, టీడీపీ చేస్తున్న అరాచకాలను వివరించటానికే మీడియా సమావేశం నిర్వహించాను అని తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా నేను ఎస్ఈసీని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు అన్నారు. నాని తరపున వివరణ లేఖను న్యాయవాది తానికొండ చిరంజీవి ఈసీ కార్యాలయంలో అందించారు. ఎక్కడా ఎన్నికల కమిషన్ ని గాని, కమిషనర్ ను ఉద్దేశించి మాట్లాడలేదని వివరణలో పేర్కొన్నారు.
కేవలం ప్రతిపక్ష నేత చంద్రబాబు,నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య గల బంధం గురించి ప్రజలు అనుకునేది మాట్లాడాను అని ఆ వివరణలో తెలిపారు. సాయంత్రం లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించడం హక్కుల ఉల్లంఘన అని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ లో సభ్యునిగా ప్రివిలేజెస్ ఉన్నాయని గుర్తించాలి అని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన షోకాజ్ నోటీస్ ను వెనక్కి తీసుకోవాలని వివరణ ఆయన కోరారు.