జాగ్రత్త జగన్… ఒకప్పుడు బాబుపనుల్లో ఇవీ ఉన్నాయి!

-

ఒకానొక సమయంలో బాబును వైఎస్సార్ గద్దె దింపిన సమయంలో బాబు దారుణ పాలనకు తోడు అధికారుల నిర్లక్ష్యాలు కూడా బాగా తోడయ్యాయి! అదే సమయంలో ఆ నిర్లక్ష్యాలను క్లియర్ చేసే విషయంలో కూడా బాబు పరిపూర్ణమైన అలసత్వం వహించారని అంతా భావించారు కూడా! అందులో కీలక అంశంగా మారింది అప్పట్లో “కరెంటు బిల్లులు”! నాడు బాబు హయాంలో విద్యుత్ షాకుల కంటే… విద్యుత్ వినియోగ బిల్లుల షాకులే తీవ్రంగా ఉండెవి అన్నా అతిశయోక్తి కాదేమో! వాడిన మట్టుకు మాత్రమే బిల్లు రావడం వంటి విషయంలో ఒక రూపాయి అటు అయినా ఇటు అయినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు కానీ… అధికారుల తప్పిదాల వల్ల వేలకు వేలు బిల్లులు వస్తూ షాక్ కొట్టిస్తే మాత్రం అది చాలా తీవ్ర విషయంగానే పరిగణించాలి. నాడు బాబు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఇదే… పైగా ఆ బిల్లులు అన్నీ కట్టాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చేది కూడా!

ఈ విషయంలో ప్రభుత్వాలు… సంబందింత అధికారులకు కఠినమైన సూచనలు చేయని పక్షంలో ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం ఉంది! ఈ రకంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాజాగా జరిగిన కొన్ని షాకింగ్ ఘటనలు ఇప్పుడు చూద్దాం! చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామంలో ఛాన్వి అనే మహిళ ఓ గుడిసెలో బీడీలు చుడుతూ నివసిస్తోంది. ఆమె ఇంట్లో ఒక టీవీ, రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి. అలాంటి ఇంటికి ఏకంగా రూ.41వేల 149 కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో… ఆమె లబోదిబోమంటొంది! ఇదే క్రమంలో… తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందట. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సమీపంలోని ఓ గ్రామంలో పూరి గుడిసెలో ఉండే ఓ కుటుంబానికి రూ.17 వేలు, మరో కాలనీలో రేకుల షెడ్డులో ఉంటున్న కుటుంబానికి రూ.28 వేల బిల్లు వచ్చిందట!

ఒకప్పుడైతే ఇది మామూలు సమస్య కాదు.. ప్రతిపక్షాలు ఈపాటికే రోడ్లెక్కి నానా యాగీ చేసేవి! కాకపోతే… ఇది కరోనా వంటి క్లిష్ట సమయంలో ఎదురైన కొన్ని ఇబ్బందులు, మరికొన్ని కమ్యునికేషన్ గ్యాప్ ల కారణంగా వచ్చిన సమస్యలుగా ప్రజలు భావించి అర్ధం చేసుకోవచ్చేమో కానీ… ఇవి రిపీట్ అయితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి! ఈ విషయంలో జగన్ చాలా జాగ్రత్త వహించాలని… విద్యుత్ అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా జగన్ కు తగిలేది మామూలు దెబ్బ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతింత బిల్లులు వచ్చినంత మాత్రాన్న వారిని కట్టమని గుడ్డిగా బలవంతపెట్టే సీఎం కాకపోయినా… ఈ వ్యవహారాలు ప్రజల్లోకి చాలా సులువుగా వెళ్లడంతో పాటు, బలమైన నెగిటివ్ కెరటాలు ప్రభుత్వాన్ని తాకుతాయనేది మాత్రం వాస్తవం!!

ఆ సంగతి అలా ఉంటే… కరోనా వంటి కీలక సమయం.. ఇంటిల్లపాదీ ఇంట్లోనే ఉంటున్న సమయం.. పైగా తీవ్రమైన ఎండలు.. ఈ విషయంలో విద్యుత్ శాఖ మాత్రం, ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా సమర్ధవంతంగా పని చేయడం అభినందనీయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు! ఇక ఇలాంటి తప్పిదాలు కూడా జరక్కుండా చూసుకుంటే… ఆల్ హ్యాపీస్!

Read more RELATED
Recommended to you

Latest news