ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ రష్యా దేశం శుభవార్త చెప్పింది. అక్కడ మరో 2 రోజల్లో కరోనా వ్యాక్సిన్ ప్రజా పంపిణీకి సిద్ధం కానుంది. ఈ మేరకు రష్యా ఆరోగ్యశాఖ మంత్రి వివరాలను వెల్లడించారు. అక్కడి గమాలయా ఇనిస్టిట్యూట్ చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయని, అందువల్ల ఆగస్టు 10 నుంచి కరోనా వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వస్తుందని అన్నారు. ఇది ప్రపంచానికే గొప్ప శుభవార్త అవుతుందని సైంటిస్టులు అంటున్నారు. అలాగే అక్కడి మరో 2 కంపెనీలు కూడా వ్యాక్సిన్ ట్రయల్స్ ను త్వరలో పూర్తి చేసి ప్రజలకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
స్పుత్‌నిక్ న్యూస్ అనే న్యూస్ వెబ్‌సైట్ చెబుతున్న ప్రకారం.. రష్యాలో గమాలాయా ఇనిస్టిట్యూట్ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తయ్యాయి. ఈ విషయాన్ని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురష్కో ధ్రువీకరించారు. ఇక వ్యాక్సిన్‌ను ప్రస్తుతం పెద్ద ఎత్తున డోసుల్లో ఇచ్చేందుకు ఉత్పత్తి చేస్తున్నారు. ఆగస్టు 10వ తేదీ వరకు అక్కడ వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వచ్చినా.. ముందుగా అక్కడ అత్యవసర సేవలు అందించే సిబ్బందికే వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. తరువాత ప్రజలకు పంపిణీ చేస్తారు.
కాగా కరోనా వ్యాక్సిన్‌ను లాంచ్ చేస్తే రష్యా దేశంలో ఈ రేసులో రికార్డులకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు అమెరికా, బ్రిటన్, భారత్‌లు మాత్రమే కరోనా వ్యాక్సిన్ రేసులో నిలిచాయి. కానీ అనూహ్యంగా రష్యా వ్యాక్సిన్‌ను ముందుగా లాంచ్ చేస్తోంది. మరి రష్యా అనుకున్న ప్రకారం మార్కెట్‌లోకి వ్యాక్సిన్‌ను విడుదల చేస్తుందా, లేదా అన్నది చూడాలి.