కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన కిసాన్ రైలు సేవలు ఆరంభమయ్యాయి. ముంబయిలో నిర్వహించిన కార్యక్రమంలో తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, రైల్వేమంత్రి పీయుష్ గోయల్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
కూరగాయలు, పండ్లతో మహారాష్ట్రలోని దేవ్లాలీ నుంచి.. బిహార్ దానాపూర్‌కు వారానికి రెండుసార్లు నడవనుంది కిసాన్ రైలు. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు దేవ్లాలీలో బయలుదేరి.. మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు దానాపూర్ చేరుతుందని మంత్రి తెలిపారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు దానాపూర్‌లో బయలుదేరి సోమవారం సాయంత్రం 8 గంటల సమయానికి దేవ్లాలీ చేరుకుంటుందని చెప్పారు.కేంద్రీయ రైల్వే పరిధిలోని భుశావల్ డివిజన్ సహా నాసిక్ పరిసర ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లు, పూలు అత్యధిక విస్తీర్ణంలో సాగవుతుండగా.. వాటిని పట్నా, అలహాబాద్, కత్ని, సత్నా వంటి ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. ఆయా ప్రాంతాల రైతులకు ఉపయోగపడాలనే లక్ష్యంతో తొలి కిసాన్ రైలును ప్రారంభించారు. ఈ రైలు నాసిక్ నుంచి బక్సర్ మధ్య అనేక స్టేషన్లలో ఆగనుంది.