రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర పోరు ఆరోరోజుకు చేరింది. ఇరు దేశాలు పోరాడుతున్నాయి. ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలని ఒకరు.. నిలువరించేందుకు మరొకరు ఇలా రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఇది రాజ్ పుత్ లపై మొఘలులు చేసిన ఊచకోతలా ఉందని ఇండియాలోని ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలిఖా అన్నారు. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపేందుకు మేం అన్ని వనరులు ఉపయోగించుకుంటున్నామని.. మేము ప్రతీసారి ప్రభావవంతమైన ప్రపంచనాయకులందరినీ అభ్యర్థిస్తున్నామని.. వారిలో మోడీజీ ని కూడా కోరుతున్నామని ఆయన అన్నారు.
ఉక్రెయిన్ కు మానవతా సహాయం అందిస్తున్న భారతదేశానికి థాంక్స్ చెప్పారు ఇగోర్ పోలిఖా. భారత్ ఉక్రెయిన్ కోసం మానవతా సాయం కింది మెడిసిన్స్ అందిస్తోంది. భారత్ సాధ్యమైనంత ఎక్కువగా మానవతా సాయం అందిస్తుందని.. భారత విదేశాంగ శాఖ హామీ ఇచ్చిందని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ఖార్కివ్ లో బాంబు దాడిలో మరణించిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతి పట్ల ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇంతకు ముందు కేవలం సైనిక ప్రదేశాల్లో మాత్రమే దాడులు జరిగేవని.. ప్రస్తుతం పౌర ప్రాంతాల్లో కూడా దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.