అంబానీ ఇంటి ముందు పార్క్ చేసిన కారులో సచిన్ వాజే హస్తం..!

-

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసును ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేపడుతోంది. అయితే ఈ కేసులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వాహనంలో ఉన్న పేలుడు పదార్థాలను సచిన్ వాజేనే విక్రయించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో అరెస్ట్ అయి.. సస్పెన్షన్‌కు గురైన పోలీస్ అధికారి సచిన్ వాజే.. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. పేలుడు పదార్థాలతో ఉన్న వాహనాన్ని ముకేశ్ అంబానీ ఇంటి ముందు పార్క్ చేసిన సమయంలో సచిన్ వాజే అక్కడే ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా ఆధారాలు సేకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు పేర్కొన్నారు.

సచిన్ వాజే

దక్షిణ ముంబయిలో ఫిబ్రవరి 25వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. సచిన్ వాజేనే ఆ కారును కొనుగోలు చేసి ముకేశ్ అంబానీ ఇంటి ముందు పార్క్ చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో కూడా సీసీటీవీ ఫుటేజీని సేకరించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. అప్పుడే సచిన్ వాజే కదలికలను తెలుసుకున్నామన్నారు. పేలుడు పదార్థాలతో ఉన్న వాహనాన్ని అంబానీ ఇంటి ముందు పార్క్ చేసినప్పుడు సచిన్ వాజే కూడా అక్కడే ఉన్నట్లు విచారణలో తేలింది. సచిన్ వాజే వ్యక్తిగత డ్రైవరే అక్కడ కారును పార్క్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. డ్రైవర్ స్కార్పియో కారును తీసుకుని రాగా.. అతడి వెనుకే వాజే తెల్లరంగు ఇన్నోవా కారుతో అనుసరించాడని అధికారులు చెబుతున్నారు.

ఫిబ్రవరి 17వ తేదీన మన్‌సుఖ్ హిరేన్ స్కార్పియోను ములంద్ ఎరోలీ రోడ్డు వద్ద నిలిపి, అదే రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సచిన్ వాజేకు కారు తాళాలు ఇచ్చి ఉంటాడని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆ కారును వాజే పర్సనల్ డ్రైవర్ సాకేత్ హౌసింగ్ సొసైటీలోని వాజే ఇంటి వద్ద పార్క్ చేశాడని, అలా కారును ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి వరకు సచిన్ వాజే నివాసం వద్దే ఉందని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 25వ తేదీన వాజే పర్సనల్ డ్రైవర్ కారును తీసుకెళ్లి అంబానీ ఇంటి సమీపంలో పార్క్ చేసినట్లు.. ఆ స్కార్పియో వెనుకాలే వాజే ఇన్నోవాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కారును పార్క్ చేసిన అనంతరం డ్రైవర్, సచిన్ వాజే ఇద్దరు ఇన్నోవా కారులో వెళ్లిపోయినట్లు తెలిపారు. కొద్ది సేపటి తర్వాత మళ్లీ వచ్చి.. బెదిరింపు లెటర్, సాక్ష్యాలను మాయం చేసేందుకు సీసీ ఫుటేజీ రికార్డులను ధ్వంసం చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version