తెలంగాణ రాష్ట్ర ప్రజలు, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..సీఎం కేసీఆర్ తలపెట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం రెండో రోజుకు చేరుకుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో 300 మంది రుత్వికులతో ఐదు రోజులపాటు చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం కొనసాగనుంది. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యాగం కొనసాగుతోంది. చండీయాగంలో ఆఖరి రోజున పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మహారుద్రసహిత సహస్ర చండీయాగం సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది.
విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో ప్రారంభమైన యాగానికి… కర్ణాటకలోని శృంగేరి పీఠానికి చెందిన తంగిరాళ సీతారామ శాస్త్రులు, మాడుగుల మాణిక్య సోమయాజులు, ఋగ్వేద పండితులు నరేంద్ర కాప్రే తదితర ప్రముఖులు వైదిక సారథ్యం వహించారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మధ్యంతర ఎన్నికల సమయంలోనూ రాజశ్యామల మహా యాగాన్ని సైతం నిర్వహించిన విషయం తెలిసిందే.