మన భూమిని పోలిన మరో భూమి

-

కెప్లర్‌ టెలిస్కోప్‌.. పాపం 2018లోనే రిటైరయినప్పటికీ, అదిచ్చిన సమాచారం ఇప్పుడు కళ్లు తెరిపించింది. మనుషులకు మరో ఆశ కల్పించింది.

సుదూర విశ్యంలో ఉన్న గ్రహ విశేషాలను కనుగొనడానికి నాసా ప్రయోగించిన భారీ టెలిస్కోప్‌ – కెప్లర్‌. 2009లో నాసా అంతరిక్షంలోకి పంపిన ఈ భారీ టెలిస్కోప్‌, తన విద్యుక్తధర్మమైన భూమి లాంటి గ్రహాన్వేషణను నిరాటంకంగా తొమ్మిది సంవత్సరాల పాటు కొనసాగించి, ఇంధనం అయిపోవడం మూలాన తప్పనిసరి పరిస్థితుల్లో 2018లో పదవీ విరమణ చేసింది. ఈ కాలక్రమంలో మన సౌర కుటుంబం ఆవల 2600 లకు పైగా కొత్త గ్రహాలను కనుగొంది. వాటిలో చాలా వరకు జీవం ఉనికికి అవకాశం ఉన్నవే.

2013లో కెప్లర్‌ సుదూరంలో ఉన్న ఒక గ్రహానికి సంబంధించిన సమాచారం భూమికి పంపింది. దాన్ని సరిగ్గా విశ్లేషిచడంలో పొరబడ్డ శాస్త్రజ్ఞులు, ఆ గ్రహానికి ‘‘కెప్లర్‌-1649సి’’గా నామకరణం చేసి, పనికిరానిదిగా తేల్చేసారు. తీరా ఈ మధ్య మరోసారి అదే సమాచారాన్ని పరిశీలిస్తే, విస్తుగొలిపే వాస్తవాలు తెలిసాయి. ఈ కెప్లర్‌-1649సి దాదాపుగా భూమిని పోలిఉంది. ఇప్పటివరకు కనుగొన్న ఆన్ని గ్రహాలలోకెల్లా ఇదే భూమికి చాలాచాలా దగ్గరి పోలికలతో ఉంది

మన భూమికి దాదాపు 300 కాంతి సంవత్సరాల దూరంలో ఒక ఎర్రని మరుగుజ్జు నక్షత్రం (కెప్లర్‌-1649) చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ గ్రహం, తన భ్రమణం పూర్తి చేయడానికి 19.5 భూదినాలు (మన రోజులు) తీసుకుంటుంది. ఈ నవగ్రహం మన భూమి కన్నా 1.06 రెట్లు ఎక్కువ పరిమాణంతో ఉంది. అంటే దాదాపు సమానమన్నమాట. అలాగే, తనపై ప్రసరించే తన ‘సూర్యుడి’ కాంతి, మన సూర్యకాంతిలో 75శాతం ఉంటుంది. తన సూర్యుడైన  ఆ మరుగుజ్జు నక్షత్రం కాంతి తక్కువగా ఉండటం వల్ల 1649సి పై ఉష్ణోగ్రతలు కూడా మన మాదిరిగానే ఉండే అవకాశం ఉంది.

నాసా ఉన్నతాధికారి అయిన థామస్‌ జుర్బుచెన్‌ మాట్లాడుతూ, ‘‘ఈ ఆసక్తికర ప్రపంచం మనకు మంచి ఆశను కల్పిస్తోంది. ఈ విశాల విశ్వంలో, ఈ నక్షత్రాల మధ్యలో  రెండో భూమి ఎక్కడో మనకోసం ఎదురుచూస్తోంది’’ అని అన్నాడు.

అయితే, ఈ కెప్లర్‌-1649సి గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియదు. అక్కడి వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, ఉష్ణోగ్రతల గురించి మరింత లోతుగా అధ్యయనం చేయాల్సివుంది. సాధారణంగా ఇలాంటి శిలావృత గ్రహాలలో నీరు ద్రవరూపంలోనే ఉండే అవకాశముందని శాస్త్రవేత్తల అభిప్రాయం. కాకపోతే, కెప్లర్‌-1649సి నివాసయోగ్య గ్రహాల అన్వేషణపై ఆసక్తిని మరింత పెంచింది.

Read more RELATED
Recommended to you

Latest news