స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సంపాదించింది. ఈ క్రమంలోనే వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రం ‘థ్యాంక్స్ మీట్’ ను ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘అల.. వైకుంఠపురములో’ విడుదల కాక ముందు దీనికి సంబంధించిన చాలా విషయాలు బయటకు చెప్పినా, ఓ రెండు విషయాలను మాత్రం దాచామని అన్నారు.
ఆ రెండు విషయాల్లో ఒకటి.. ఈ చిత్రంలోని ‘సిత్తరాల..’ పాట అని, శ్రీకాకుళం యాసలో ఈ పాట ఉంటుందని చెప్పారు. దీనిని షూట్ చేయడానికి ముందు రోజు రాత్రే ఆ పాట తమకు అందిందని, దీంతో, అప్పటికప్పుడు షూట్ చేశామని, అరగంటలో తమన్ ట్యూన్ చేశాడని, ఈ పాటను ఫైట్ గా తీశామని అన్నారు. ‘సిత్తరాల..’ పాటను ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితమిస్తున్నట్టు తెలిపారు. రెండో విషయం.. బ్రహ్మానందం ఈ సినిమాలో నటించిన విషయాన్ని ముందే చెప్పకుండా దాచడం చాలా కష్టమైందని త్రివిక్రమ్ చెప్పారు.