శబరిమల యాత్రకు సర్వం సిద్దమైంది. యాత్రకు భక్తులను అనుమతిస్తున్నట్టు ప్రకటించిన కేరళ ప్రభుత్వం..కరోనా నిబంధనలను కఠినతరం చేసింది. ఆలయంలో అయ్యప్పస్వామి దర్శనాలకు వచ్చే స్వాములు తప్పని సరిగా కరోనా నియంత్రణ చర్యలు పాటించేలా చర్యలు తీసుకుంటోంది. పంబా నది నుంచి సన్నిధానం వరకు కరోనా నిబంధనలు అమలు చేయనుంది. ఇందులో భాగంగా…వర్చువల్ క్యూ విధానం ద్వారా ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికే ఆలయంలోకి అనుమతిస్తామని తెలిపింది ప్రభుత్వం. అయ్యప్పస్వామి దర్శనం తర్వాత ఎవరూ కొండపై ఉండడానికి వీళ్లేదని ప్రకటించింది.
అయ్యప్ప సన్నిధానం ప్రాంగణంలో ఉండేందుకు భక్తులకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసింది ట్రావెన్ కోర్ బోర్డు. పంబానదిలో కూడా పుణ్యస్నానాలకు అనుమతి లేదని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 16 నుంచి శబరిమల యాత్ర ప్రారంభం కానుండడంతో ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. భక్తులు తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటిస్తూ…అయ్యప్ప దర్శనాలకు రావాలని సూచించింది.