హైదరాబాద్‌లో పలువురి ప్రముఖుల వాట్సాప్ హ్యాక్ అయినట్టు సమాచారం అందుతోంది. ఎమర్జెన్సీ మెసేజ్‌ల పేరుతో కొంత మంది సెలబ్రిటీలకి వాట్సాప్ మెసేజ్ లు వచ్చాయి. ఎమర్జెన్సీ హెల్ప్ కదా అని దానిని ఓపెన్ చేస్తే ఆరు డిజిట్ల కోడ్ తో ఎస్‌ఎంఎస్ లని సైబర్ క్రైం నేరగాళ్లు పంపారు. ఆ ఓటీపీ నెంబర్ పంపాలంటూ రిక్వెస్ట్ చేయడంతో కొంతమంది వారికీ ఓటీపీ నెంబర్ చెప్పగానే వాట్సాప్ క్రాష్ అయింది.
బాధితుల్లో పలువురు ప్రముఖ సెలబ్రిటీలు, డాక్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది. వారి పేర్లు బయటకు రాకున్నా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వాట్సాప్‌లో వచ్చే కోడ్ మెసేజ్‌లను ఎవరికీ పంపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోడ్ పంపితే వాట్సాప్ చాట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి కోడ్ లు చెప్పవద్దని సైబర్ నిపుణులు కూడా చెబుతున్నారు.