ఇవి ఉద్దేశాలు,ఇవి ఊహలు అని ఎప్పుడయినా మీకు తెలుస్తున్నాయా ? ఊహా రద్దు చేసి ఉద్దేశంను స్థిరం చేయడం సాధ్యమా ? అసాధ్యత అన్నది అన్నింటా ఉంటుంది..ప్రేమ మరియు ద్వేషం కొన్నింట ఎన్నటికీ అసాధ్యాలే ! ఇవాళ గెలుపు కూడా రేపటి ఓటమి చెంత అస్థిరమే ! అస్థిరం అయిన వాటికి కొనసాగింపు ఉంటుందా ? గెలుపు ఓటమి రెండు అస్థిరాలు కదా! అదే రీతిన, అదే విధాన అవమానం కూడా ! వాటి కొనసాగింపులను పట్టించుకోకుండా ఉండలేం.. ఉండే వీల్లేదు..ఆ విధంగా ఆగే వీల్లేదు కూడా !
పడిపోవడం కూడా ఇష్టంగానే చేయాలని విన్నాను. ఎక్కడో ఓ చోట పడిన చోటు గాయం.. తారల్లా తెగి పడ్డాక జ్ఞాపకం.. అటువంటి నేల ఓ స్థావరం.. అదే ఓ వరం కూడా ! అవమానం భారం అని రాయకూడదు. వరం అని రాయాలి. తెగిపడిన తారల చెంత రేయి వికాస పూర్వకం.. సంతోష దాయకం. దుఃఖం విడిచిన తరువాత పొందిన స్థితిని ఇక్కడ సంతోషం అని రాయాలి.
ఏమయినా సాధ్యం కావాలి.. దేహంలో దాగిపోయిన స్వార్థాలే కదా! ఇవి కనుక సాధ్యత వీడి ప్రయాణించడం అసాధ్యమే !
ఇప్పుడు అవమానం ఓ కలెక్టరేట్ వాకిట ఉండవచ్చు.. ఓ ఆఫీసు గుమ్మంలోనూ జరగవచ్చు.. ఏమీ లేని రోజున ఇవన్నీ ఉన్నాయా ? లేదా ? అన్నీ ఉన్నాయి అన్న భ్రమలో ఉన్నప్పుడే ఇవి ఉన్నాయా..గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే ప్రశ్నే ఓ సూదంటు రాయి. దేవుడు మాత్రమే ! కొన్నింటిని దూరం చేసే కన్నీళ్లిస్తాడు.. మనిషి వాటికి కారణం అయి ఉంటాడు కదూ! కారణం అయిన మనిషికి దూరం కావడం కన్నా అకారణమో, కారణమో సంబంధిత కాలాన్ని స్మరించక ఉండడమే మేలు. మంచిది కూడా !
జీవితంలో ఎన్నో చోట్ల ఆగిపోవాలి.. చుట్టూ ఉన్న నీడలు ప్రశ్నిస్తూ ఉండాలి.. ఒక్కసారి ఈ కష్టం నుంచి దేవుడే రక్షించాలి.. ఎదిగిన కొద్దీ మనిషిగా మిగలడం చాలా కష్టం సర్.. ఈ మాట రాయడానికి మేమెన్నో అవస్థలు దాటాలి.. మీరూ ఎన్నో అవస్థలు దాటుకుని రావాలి. ఇన్నింటినీ దాటాక జీవితం ఓ పూలవనంలో ఉండదు.. పూలవనంలా ఉండదు. ఓ మాదిరి వర్షాలూ, ఓ మాదిరి దుఃఖాలూ కలవడంతోనే జీవితం బాగుంది. బాగుంటుంది కూడా ! ఓటములు దాటిన ప్రతిసారీ అనంతం అయినవేవో గుర్తుకు వస్తాయి.. అమ్మా నాన్న తో పాటు అనంతం అయినవి వారి ప్రేమను కూడా గుర్తుచేసి వెళ్లాయి..
మీరు ఏం సాధించారు. మీ జీవితం ఎక్కడ ఎందుకని ఆగిపోయింది. అయ్యో ! దేశ రాజధానిలో కూడా ఎన్నో అవమానాలు ఉన్నాయి.. వాటిని దాటుకుని వచ్చిన మనుషులూ ఉన్నారు. తిండి లేక కొన్ని దారుల చెంత అభాగ్య నీడలు ఉన్నాయి.. అక్కడా అవమానాలు ఉన్నాయి.. డబ్బూ, కీర్తీ రెండూ లేని రోజులు ఉన్నాయి. ఒక చిన్న గదిలో తలదాచుకున్న కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలను ఉతికి ఆరేయించిన నాయకులూ ఉన్నారు..మనం ఎక్కడో ఆగిపోతాం. బొగ్గు ముక్క పట్టుకుని రాసిన రాతల దగ్గర నాణ్యతలు వెతుక్కుని ఆగిపోతాం. ఆగిపోయిన చోటు అమ్మానాన్న ఎవ్వరూ ఉండరు. మంచిదే ! ప్రతి అవమానం గుండెకు మంచిది. ఎదిగే క్రమాన్ని విస్తారం చేసేందుకు మంచిది.
మేలుకొలుపు కావొచ్చు. మేలి మలుపు కావొచ్చు. కారణం ఆగిపోవడం కాదు కారణం ప్రయాణించడంలోనే ఉంది.. ప్రవాహం ఒకటి అన్యం అయి ఉంటుంది.. ఇతరులకు చెంది ఉంటుంది..దానిని సొంతం చేసుకోవడంలో విజయం ఉండి ఉంటుంది. స్వర్గ సమానం అయిన విజయం ఒకటి వెంట వస్తుంది. వరించి వస్తుంది.. దక్షిణాఫ్రికా దారులు గాంధీని మహాత్ముడ్ని చేశాయి.ఆహా ! గొప్ప పోలిక.. ఈ పోలిక చేశాక చుట్టూ ఉన్నవాళ్లంతా తిట్టుకుంటుంటారు. ఏమీ లేని రోజు ఒకటి తప్పక ఉంటుంది..కన్నీరో.,దుఃఖమో పదవులు కాదు కేవలం మనుషులు మాత్రమే అందించి వెళ్తారు. ఇప్పుడు కూడా కన్నీరో.,దుఃఖమో మనుషులే అందించి వెళ్లాలి..వెళ్తారు కూడా!
– రత్నకిశోర్ శంభుమహంతి