తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలో పలు రాష్ట్రాల్లో కూడా ఆదరణ పొందిన సమ్మక్క – సారలమ్మలపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగ చిన జీయర్ వ్యాఖ్యలపై సమ్మక్క – సారలమ్మ భక్తులు, రాజకీయ నాయకులు, ఆదివాసీ సంఘాల నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సమ్మక్క – సారలమ్మలను అవమానించిన చిన జీయర్ స్వామి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగ తాజా గా ఆదివాసీ సంక్షేమ సంఘం ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివాసీ దేవతలు అయిన సమ్మక్క – సారలమ్మ లపై అనుచిత వ్యాఖ్యలే చేసిన చిన జీయర్ స్వామిపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిన జీయర్ స్వామిపై వెంటనే అట్రాసిటి కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.
అలాగే చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఘాటుగా స్పందించింది. సమ్కక్క – సారలమ్మ జాతరకు ఫ్రీ జనాలు వస్తున్నారని.. సమతా మూర్తి విగ్రహం వద్దకు టిక్కెట్ లేనిది రానివ్వరని అన్నారు. దీనిలో ఏది వ్యాపారం అని ప్రశ్నించారు. చిన జీయర్ స్వామి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.