తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం సొంత పార్టీ కార్యకర్తలకే నచ్చడం లేదు. అందుకే టీడీపీ నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే అధిష్టానం నిర్ణయానికి భిన్నంగా విజయనగరం టీడీపీ నేతలు ఒక జడ్పిటిసి ఎంపిటిసి స్థానాల్లో ప్రచారం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని విజయనగరం జిల్లాకు చెందిన అదితి గజపతిరాజు ప్రకటించారు. ఇదిలా ఉంటే చంద్రబాబు తనయుడు లోకేష్ ఇన్చార్జిగా ఉన్న మంగళగిరి పరిషత్ ఎన్నికల బరిలో కూడా టిడిపి దిగడం ఆశ్చర్యకరంగా మారింది.
దుగ్గిరాలలో టిడిపి అభ్యర్థులు పరిషత్ ఎన్నికల పోటీలో ఉన్నారని మండల అధ్యక్షుడు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. లోకల్ కార్యకర్తల అభీష్టం మేరకు పోటీ చేస్తున్నామని నేతలు చెబుతున్నారు. అయితే లోకేష్ మంగళగిరి నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉండడంతో ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఎన్నికల బహిష్కరణ అంశం మీద టిడిపిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని మాత్రమే తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నిర్ణయం సరైనది కాదని తప్పుబట్టిన జ్యోతుల నెహ్రూ తన పార్టీ పదవికి రాజీనామా చేశారు.. ఇక ఈ బహిష్కరణ నిర్ణయం పార్టీకి నష్టమని మరికొందరు నేతలు చెబుతున్నారు. ఇది కఠిన నిర్ణయం అయినా తప్ప లేదని నిన్న చంద్రబాబు చెప్పుకొచ్చారు.