నన్ను వ్యతిరేకించే వాళ్లే నా అభివృద్ధికి దోహదకులు అని పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్తో భుజం భుజం కలిపి పనిచేస్తాను. నాకు ఎలాంటి ఈగో లేదు. ప్రతిపక్షాలు చెబుతున్న దానికి విరుద్ధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉన్నది అని పేర్కొన్నారు. శుక్రవారం నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం అమరీందర్ సింగ్ హాజరయ్యారు. సిద్ధూతో వేదికను పంచుకున్నారు.
శుక్రవారం ఉదయం పంజాబ్ భవనలో జరిగిన టీ పార్టీలో అమరీందర్ సింగ్, సిద్ధూ సమావేశమయ్యారు. ఈ సమావేశం ద్వారా ఇరువురు నేతల మధ్య గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఘర్షణకు తెరపడినట్లు అయింది.
పంజాబ్ భవన్కు మొదట సిద్ధూ చేరుకున్నారు. ఆ తర్వాత సీఎం అమరీందర్ సింగ్ వచ్చారు. పీసీసీ చీఫ్గా సిద్ధూ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో తేనీటి విందును ఏర్పాటు చేశారు. పీసీసీ చీఫ్గా సిద్ధూ నియామకంపై అమరీందర్ సింగ్ వర్గం ముందు నుంచీ విముఖంగా ఉన్నది. కానీ, అధిష్ఠానం మాజీ క్రికెటర్ వైపు మొగ్గు చూపింది. పంజాబ్ పీసీసీ చీఫ్ సునీల్ జక్కర్ స్థానంలో సిద్ధూ నియామకం జరిగింది.
నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురువారం సీఎం అమరీందర్ సింగ్ను కలిశారు. పీసీసీ కార్యవర్గం బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. పీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కుల్జిత్ సింగ్ నాగ్రా, సంగత్ సింగ్ గిల్జియాన్లను నియమిస్తూ సిద్ధూతో సహా 56 మంది ఎమ్మెల్యే సంతకాలు చేశారు. ఈ లేఖను తీసుకుని వచ్చిన తర్వాతే పంజాబ్ సీఎం సమావేశానికి హాజరుకావడానికి అంగీకరించడం గమనార్హం.